నిర్మల్ జిల్లాలో దారుణం… జలపాతాన్ని చూడటానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిన వ్యక్తులు!

మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుంది ఎవరు ఊహించలేరు. కొన్ని సందర్భాలలో ఊహించని పరిణామాల వల్ల నిమిషాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో కూడా ఇటువంటి విషాద ఘటన చోటుచేసుకుంది. అధిక వర్షాల వల్ల నదులు, సెలయేరులు పొంగి
పొర్లుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు కూడ నీటిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో సరదాగ జలపాతం అందాలను వీక్షించటానికి బయలుదేరిన వారు అనుకోని ప్రమాదం వల్ల మృత్యువాత పడ్డారు.

వివరాలలోకి వెళితే…జగిత్యాల జిల్లా రాయికల్ మండలం, ఇటిక్యాల గ్రామంలోని యువకులంతా కలిసి సరదాగా నిర్మల్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని చూడటానికి బయలుదేరారు. ఈ క్రమంలో మొత్తం పదమూడు మంది యువకులు టాటా మ్యాజిక్ వాహనంలో బయలుదేరారు. వీరు వెళ్తున్న వాహనం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఇక్బాల్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో రహదారి పక్కన ఉన్న ఒక భారీ వృక్షం అకస్మాత్తుగా వీరు ప్రయాణిస్తున్న వాహనం మీద విరిగి పడింది.

ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడు తీవ్రగాయాల పాలవటంతో ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొక యువకుడికి తీవ్ర గాయాలు అవటంతో నిజామాబాద్ ప్రభుత్వ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధిక వర్షాల వల్ల వృక్షం విరిగిపడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.