అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం.. సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన నిండు గర్భిణి…!

దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ దేశంలోని కొన్ని మారుమూల ప్రాంతాలలో ప్రజలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. వారు నివసించే గ్రామాలకు సరైన వసతులు లేకపోవడం వల్ల వారి బ్రతుకులు చీకటిలోనే ఉంటున్నాయి. అంతేకాకుండా సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో రోగులను ఆస్పత్రికి తరలించి సరైన చికిత్స అందించేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఎంతోమంది వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. రవాణా సదుపాయాలు సక్రమంగా లేకపోవటంతో సరైన సమయంలో వైద్యం ముందుకు ఒక నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే… అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మారుమూల గడుతూరు పంచాయతీ బొడ్డపాడుమామిడి గ్రామానికి చెందిన పాంగి సాలుమతి అనే మహిళ నిండు గర్భిణి. నెలలు నిండటంతో మూడురోజుల క్రితం ఈమెకు నొప్పులు వచ్చాయి. అయితే ఆస్పత్రికి తరలించడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నొప్పులు వచ్చినా కూడా ఇంటికే పరిమితం అయింది. అయితే చాలుమతి ఆరోగ్య పరిస్థితి విషమించటంతో గ్రామంలో ఉన్న కొందరు నాయకులు ఈ విషయాన్ని సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గోవిందరావు తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఈ విషయాన్ని వివరించాడు.

కలెక్టర్ వెంటనే స్పందించి ఒక వైద్య బృందాన్ని గ్రామానికి పంపించి గర్భిణీకి సరైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించాడు. దీంతో ఓ వైద్య బృందం సోమవారం మధ్యాహ్నం గర్భిణీకి చికిత్స అందించడానికి బయలుదేరింది. ఈ వైద్య బృందం గ్రామానికి చేరుకునే సమయానికి ఆ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్లే ఒక నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయిందని అక్కడికి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.