అచ్చెన్నాయుడు అంటే సామాన్యుడు కాదు. అంటే నేను చెప్పేది ఆయన విగ్రహావైభవం గూర్చి కాదు. రాజకీయనేపధ్యం, అనుభవం చాలా పెద్దవి. ఎర్రన్నాయుడి సోదరుడిగా రాజకీయాల్లో ప్రవేశించి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి గెలిచినపుడే ఆయనకు మంత్రిపదవిని కట్టబెట్టారు చంద్రబాబు. కాబట్టి ఆయనకు ప్రభుత్వం ఎలా నడుస్తుంది?, అధికారయంత్రాంగం ఎలా పనిచేస్తుంది అన్న అంశాల పట్ల అవగాహన ఉండే ఉంటుంది. అందునా మొన్నటిదాకా కీలకశాఖకు మంత్రిగా వ్యవహరించిన ఆయన ఎంతో హుందాగా మాట్లాడాలి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అని సామెత చెప్పినట్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబే సంస్కారహీనంగా నోరు పారేసుకుంటుంటే ఇక అచ్చెన్నకు నీతులు చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి?
తనను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ” ”చాలెంజ్ చేసి చెబుతున్నాను… మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. హోం మినిస్టర్ పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టేది లేదు” అని హెచ్చరించారు. అంటే ఆయన ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలచుకున్నారు? అధికారంలోకి వస్తామని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ హోమ్ మినిష్టర్ పదవిని తీసుకుంటా అని చెప్పడంలో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? మంత్రి పదవులు ముఖ్యమంత్రి విచక్షణానుసారం ఎమ్మెల్యేలకు దక్కుతాయి తప్ప వాటిలో ఏరుకుని తనకు నచ్చింది తీసుకోవడానికి మంత్రిమండలి అనేది ఏమైనా ముఖ్యమంత్రిగారి సొంత దుకాణమా? ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం కాదా? రాబోయే రోజుల్లో నేను ప్రధానమంత్రిని అవుతాను కాబట్టి ఇప్పటి నుంచే దేశం మొత్తం నాకు సలాం చెయ్యాలంటే మన ప్రజాస్వామ్యంలో సాధ్యం అవుతుందా?
ఇక పై అధికారుల ఆదేశానుసారం పనిచేసే పోలీసులను బెదిరించడం చూస్తుంటే గురువిందగింజ గుర్తుకొస్తుంది. పోలీసులు అధికారదుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వైసిపి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ రేపు తాను హోమ్ మంత్రి అయి పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపధాలు చెయ్యడం అంటే ఆ పోలీసులను తనకు తొత్తులుగా ఉండాలని వార్నింగ్ ఇవ్వడమే కదా!పోలీసు యంత్రాంగం ఎప్పుడూ ఒకేవిధంగా పనిచేస్తుంది. వారికి ప్రభుత్వ ఆదేశాలే ప్రధానం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు. మొన్నటిదాకా తెలుగుదేశం నాయకుల ఆదేశాలను క్షణాల్లో అమలు చేసింది ఇదే పోలీసులు కాదా? విమానాశ్రయాల్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నది, చంద్రబాబుకు సెల్యూట్లు చేసింది ఇదే పోలీసులు కదా? ప్రభుత్వంలో ఎవరుంటే పోలీసులు వారి ఆదేశాలనే అమలు చేస్తారు. అలాంటి పోలీసులను కాబోయే హోమ్ మంత్రిని అంటూ బెదిరిస్తే వారు భయపడతారా?
ఇక హోమ్ మంత్రి అంటే పోలీసులు అందరికీ యజమాని అనే భ్రమల్లో అచ్చెన్నాయుడు ఉన్నారేమో? గతంలో హోమ్ మంత్రికి కూడా తెలియకుండా స్వతంత్రంగా వ్యవహరించిన అనేకమంది అత్యున్నతాధికారులు ఉన్నారు. హోమ్ మంత్రి ఆదేశాలు శిరోధార్యం కాదు. ఉమ్మడి రాష్ట్రానికి దినేష్ రెడ్డి డిజిపిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడూ హోమ్ మంత్రి ఆదేశాలు పాటించిన దాఖాలాయే లేదు. యాభైమంది డీఎస్పీ హోదా కలిగిన అధికారులను బదిలీ చేస్తున్నప్పుడు ఆయన ఆనాటి హోమ్ మంత్రికి మాటమాత్రం కూడా సమాచారం ఇవ్వలేదు. హోమ్ మంత్రి అంటే పోలీసు సంక్షేమాన్ని చూస్తూ, విధి నిర్వహణలో వారి కష్టనష్ఠాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, అవసరం అనుకుంటే పోలీసులకు సలహాలు ఇవ్వడం తప్ప తనిష్టమొచ్చినట్లు పోలీసులను బదిలీ చెయ్యడం, సస్పెండ్ చెయ్యడం, డిస్మిస్ చెయ్యడం, బొమ్మలను ఆడించినట్లు ఆడించే అధికారం ఉంటుందని అచ్చెన్నాయుడు భ్రమల్లో మునిగితేలుతున్నాడేమో అర్ధం కావడం లేదు. నిష్టూరంగా చెప్పాలంటే శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ ను కూడా తొలగించే అధికారం హోమ్ మంత్రికి లేదు. అనివార్య పరిస్థితుల్లో హోమ్ మంత్రి ఆదేశాలను ఉన్నతాధికారులు అమలు చెయ్యాల్సివచ్చినా, కోర్టుకు వెళ్తే ఆ ఆదేశాలు వీగిపోతాయి. ఐపీఎస్ అధికారులు ముఖ్యమంత్రి మాట వింటారు తప్ప మంత్రుల మాటలను అసలు లెక్క చెయ్యరు.
పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన నిందితుడు జైల్లో ఉండడు. తనను అరెస్ట్ చెయ్యడం అన్యాయం అనుకున్నప్పుడు కోర్టుకు వెళ్లి న్యాయాన్ని కోరాలి. పోలీసుల అరెస్ట్ అక్రమం అని కోర్ట్ భావిస్తే బెయిల్ మంజూరు చేస్తుంది. గతంలో అచ్చెన్నాయుడుకు పైల్స్ చికిత్స పేరుతో రెండు నెలలలపాటు స్టార్ హోటల్లో విశ్రాంతి తీసుకునేందుకు కోర్ట్ అనుమతి ఇచ్చిన సంగతి మరచిపోతే ఎలా? పోలీసులు ఎవరినైనా అక్రమ నిర్బంధానికి గురిచేశారని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి తప్ప పోలీసులను హెచ్చరించడం, బెదిరించడం, ఆ వ్యవస్థ నైతికతను దెబ్బ తియ్యడమే అవుతుంది. హోమ్ మంత్రికి ఉన్న అధికారాలు ఏమిటో ఒకసారి ఆయన మొన్నటిదాకా హోమ్ మంత్రిగా పనిచేసిన చిన్నరాజప్పను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు