గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఇవాళ చెక్ పడింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని చంద్రబాబు నియమించబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించేందుకు లోకేశ్ బాబు అడ్డుచెప్పినట్టుగా కూడా వార్తలు రావడంతో.. టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కాస్త సందిగ్ధం నెలకొన్నది.
అయితే.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీఎల్పీ ఉపనేతగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు.
దాంట్లో 27 మంది మెంబర్స్ తో టీడీపీ కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు వెల్లడించారు. మరో 25 మందితో టీడీపీ పొలిట్ బ్యురోను ఏర్పాటు చేశారు.
ఏపీతో పాటు తెలంగాణకు కూడా కమిటీలను చంద్రబాబు ఏర్పాటు చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణనే కొనసాగించారు. రెండోసారి రమణే కొనసాగనున్నారు. అలాగే 31 మందితో టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో తెలంగాణ టీడీపీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు… టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా గల్లా అరుణకుమారి, ప్రతిభా భారతి, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నాగేశ్వరరావు, కాశీనాథ్ ఉంటారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేశ్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బక్కని నరసింహులు, రవిచంద్ర యాదవ్, దయాకర్ రెడ్డి ఉంటారు.