ఏందో కలికాలం. ఈ జనరేషన్ మొత్తం వైరస్ లతో సహజీవనం చేయాల్సిందేనా? ఎక్కడ చూసినా వైరస్ లు. సరికొత్త వైరస్ లతో ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతోంది. ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద వైరస్ లు ప్రపంచంపై దాడి చేశాయి. ఇప్పటికీ కరోనాతో మనం పోరాడుతున్నాం. కరోనా వల్ల మనం ఎంత నష్టపోయామో ఊహించలేం.
తాజాగా అసోంను మరో వైరస్ భయపెడుతోంది. అది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్.. దాన్నే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అని కూడా అంటారు. ఆ వైరస్ నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలో వెలుగు చూసినప్పటికీ.. ప్రస్తుతం దాని ఉదృతి పెరిగింది. అతి వేగంగా రాష్ట్రంలో ఆ వ్యాధి ప్రబలుతోంది.
ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో వెంటనే ప్రభుత్వం స్పందించి.. ఆ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో ఉండే 12 వేల పందులను చంపేందుకు నిర్ణయం తీసుకుంది.
12 వేల పందుల యజమానులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించనుంది. వెంటనే పందులను చంపేసి.. ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న జంతువులను సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి శర్బానంద సూచించారు.
మొత్తం 14 జిల్లాలో ఉన్న 12 వేల పందులను త్వరలోనే చంపేయబోతున్నారు. అయితే.. ఈ వైరస్ కూడా చైనా నుంచే సంక్రమించిందని తెలుస్తోంది. 2019 ఏప్రిల్ లో చైనాలోని జిజాంగ్ అనే ప్రాంతంలో ఈ వైరస్ మొదటిసారిగా వెలుగు చూసినట్టు ఆధారాలు ఉన్నాయని తెలుస్తోంది. జిజాంగ్ ప్రాంతం.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది.
నిజానికి 1921లోనే ఆఫ్రికాలోని కెన్యా, ఇథియోపియాలో ఈ వైరస్ తొలిసారి బయటపడిందట. అందుకే దీనికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ వైరస్ వెలుగుచూడటం.