సాధారణంగా ప్రతీ మహిళ తల్లీ కావాలని అషపడుతుంది. అయితే కొంతమందికి పెళ్ళి జరిగిన కొంతకాలానికి పిల్లలు పుడితే మరికొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారు. అయితే మరికొంతమంది మహిళలు మాత్రం జీవితాంతం ఎదురుచూసిన కూడా తల్లి కావాలన్న వారి కోరిక నెరవేరదు. దీంతో కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా అచ్చం ఇలాగే పిల్లలు లేని తన కూతురి బాధ చూడలేక ఆ తల్లదండ్రులు చేసిన పనివల్ల ఒక నిండు ప్రాణం బలి అయ్యింది. దీంతో వారు జైలు పాలు అయ్యారు.
వివరాలలోకి వెళితే…అసోంలోని శివసాగర్ ప్రాంతానికి చెందిన బసంత గొగయ్, హిమయై గొగయ్ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. వివాహం తర్వాత చాలా సంవత్సరాలు గడిచినా కూడా తమ కూతురికి పిల్లలు పుట్టలేదని దంపతులిద్దరూ తరుచు బాధపడేవారు. ఈ క్రమంలో ఎలాగైనా తమ కూతురికి ఒక పసిబిడ్డను ఇవ్వాలని ప్రతిరోజు ఆరాటపడేవారు. ఈ మేరకు వీరి గ్రామంలో నివాసం ఉంటున్న ఓ మహిళకు 10 నెలల చిన్నారి ఉంది. బసంత గొగయ్, హిమయై గొగయ్ దంపతులు ఇటీవల ఆ మహిళను తమ ఇంటికి ఆహ్వానించి పది నెలల చిన్నారిని తమ కూతురికి ఇవ్వమని వేడుకున్నారు.
దీంతో సదరు మహిళ తన కన్న బిడ్డను ఇవ్వటానికి నిరాకరించింది. ఈ దంపతులిద్దరూ ఎంత బతిమెలాడినా కూడా ఆమె అంగీకరించకపోవడంతో వీరిద్దరూ ఆగ్రహానికి గురై ఆమెపై పదునైన వస్తువుతో దాడి చేశారు. వీరిద్దరూ చేసిన దాడిలో మహిళా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ విషయం బయటికి పోకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు గొయ్యి తీసి ఆమెను పూడ్చిపెట్టారు. చిన్నారితో సహా తల్లి కూడా రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం వెతికి ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా బసంత గొగయ్, హిమయై గొగయ్ దంపతులు నిందితులు అని తేలడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.