అర్నాబ్ గోస్వామి.. ప్రస్తుతం ఇదే పేరు దేశమంతా మారుమోగిపోతోంది. అర్నాబ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక జర్నలిస్ట్ ను ఈ విధంగా అరెస్ట్ చేస్తారా? అంటూ అందరూ పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్నారు.
బుధవారం ఉదయమే అర్నాబ్ ను పోలీసులు తన ఇంట్లోనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి లాక్కెళ్లినట్టు వీడియోలు కూడా మనం చూశాం. తనపై పోలీసులు దాడి చేశారని.. అర్నాబ్ కూడా ఆరోపించారు.
అయితే.. 2018 లో ఓ ఆర్కిటెక్ట్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకున్న కేసులో అర్నాబ్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ కేసుకు సంబంధించిన విచారణ కోసమే అర్నాబ్ ను అదుపులోకి తీసుకొని.. రాయ్ గఢ్ కు తీసుకెళ్తున్నామని పోలీసులు తెలిపినా.. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరిగ్గా లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్నాబ్ ను లాక్కెళ్లి.. దాడి చేసి గాయపరిచారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న సమయంలో బయట మీడియాతో మాట్లాడిన అర్నాబ్.. తనను పోలీసులు గాయపరిచారని.. చేతికి గాయమైందని.. చివరకు తాను షూ కూడా వేసుకోలేదని.. షూ సాక్స్ తోనే తనను లాక్కెళ్లారని అర్నాబ్ చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.