Rudrakshalu: నకిలీ రుద్రాక్షలు కొని మోసపోతున్నారా.. రుద్రాక్షలు నకిలీనా,కాదా ఇలా తెలుసుకోండి?

Rudrakshalu: ఈ ప్రకృతిలో లభించే వాటిలో మనం కొన్ని రకాల వస్తువులను దైవ సమానంగా భావిస్తాము. ఇలా దైవ సమానంగా భావించే వాటిలో రుద్రాక్షలు ఒకటి. రుద్రాక్షలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపమని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది రుద్రాక్ష మాలలు ధరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావించి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి రుద్రాక్షలు కొంటారు. అయితే మనం కొన్న రుద్రాక్షలు స్వచ్ఛమైనవి అయితే వాటి ఫలితం తప్పకుండా మనకు ఉంటుంది. అలా కాని పక్షంలో ఆ రుద్రాక్షల వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు.

మనం కొన్న రుద్రాక్ష మాలలు నిజమైనవా, లేక నకిలీవా అని ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే.. ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి అందులో ఒక రుద్రాక్ష వేయాలి. ఈ రుద్రాక్ష నీటిలో మునగకుండా తేలితే అది నకిలీ రుద్రాక్ష అని గుర్తించాలి. నీటిలో పైకి తేలడమే కాకుండా ఆ రుద్రాక్ష రంగు కూడా మారిపోతుంది. ఇలా రంగు వెలసినపుడు అది నకిలీ రుద్రాక్ష అని చెప్పవచ్చు.

అదేవిధంగా రెండు రాగి రేకుల మధ్య రుద్రాక్షను ఉంచినట్లయితే రుద్రాక్ష తనంతటతానే సవ్య దిశలో తిరుగుతుంది.ఈ విధంగా సవ్యదిశలో తిరిగే రుద్రాక్ష స్వచ్ఛమైన దిగాను అపసవ్యదిశలో తిరిగి రుద్రాక్ష నకిలీదిగాను గుర్తించాలి. ఇక నకిలీ రుద్రాక్షను కనుగొనడానికి మరొక మార్గం కూడా ఉంది. రుద్రాక్షను తీసుకొని ఆవుపాలలో వేసినట్లయితే ఆవుపాలు 48 గంటల నుంచి 72 గంటల వరకు చెడిపోకుండా తాజాగా ఉంటాయి. ఇలా పాలు చెడిపోకుండా ఉంటే అవి స్వచ్ఛమైన రుద్రాక్ష అని పాలు చెడిపోతే నకిలీ రుద్రాక్ష అని గుర్తించాలి.