దుబ్బాకలో ఓటమి తెరాస నేతలకు ఒక పెద్ద కనువిప్పు కలిగించిందనే చెప్పాలి. అప్పటిదాకా రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఊహించుకుంటున్న తెరాసకు దుబ్బాక దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మినట్లు అయ్యింది. దీనితో తేరుకున్న తెరాస నేతలు ఆ తర్వాత జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో తగిన జాగ్రత్తలు తీసుకోని ముందుకు వెళ్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇందులో భాగంగా సెంటిమెంట్ మరియు తాయిలాలు కార్యక్రమం మొదలుపెట్టారు తెరాస అగ్ర నేతలు ఆర్టీసీ ఉద్యోగులకు అడగకుండానే లాక్ డౌన్ బకాయిలు రూ.120 కోట్లు విడుదల చేశారు. తాను బతికున్నంత వరకు ఆర్టీసీని బతికించుకుంటాననే ఓ భారీ డైలాగ్ కూడా కొట్టారు.
నిన్నటికి నిన్న పారిశుధ్య కార్మికులకు ఒక్కొకరికి 3వేల రూపాయల జీతం పెంచారు. ఆస్తి పన్ను సగానికి సగం తెగ్గోసి.. మధ్యతరగతి ప్రజలకు పండగ కానుక అందించారు. వరదసాయం అదనంగా మరో 100కోట్లు ఇస్తామన్నారు. ఓవైపు కేసీఆర్ పార్కులు ప్రారంభిస్తుంటే, కొడుకు కేటీఆర్ సర్కారు దవాఖానలు ఓపెనింగ్ చేస్తూ ప్రజల్లో కలియదిరుగుతున్నారు. అయితే ఇవన్నీ కూడా కేవలం గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి ఈజీగా అర్ధం అవుతుంది. ఎన్నికలు వస్తేనే ప్రజా సంక్షేమం తెరాస ప్రభుత్వానికి గుర్తువస్తుందా అంటూ తెరాస మీద విమర్శలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో ఒక్క దుబ్బాకలో ఓడిపోతేనే ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు, అదే గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇంకెన్ని అభివృద్ధి పనులు చేస్తాడు, బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ పార్టీని ఎన్నికల్లో ఓడిస్తే తప్పకుండా బంగారు తెలంగాణ వస్తుందని ప్రతిపక్షాలు సరికొత్త ఎత్తుగడ వేస్తూ ప్రచారం చేస్తున్నాయి, దుబ్బాకలో ఓడిపోవటం వలనే కదా కేసీఆర్ ఇలాంటి వరాలు ఇస్తున్నాడని సామాన్య ప్రజానీకం కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు.
అదే ఆలోచనతో ఎన్నికల కేంద్రానికి వెళితే తెరాస కు ఇబ్బందులు తప్పవు, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు కేవలం హైదరాబాద్ అభివృద్ధి కోసమే చేస్తున్నారు అనే అభిప్రాయం కలిగించాలి కానీ, గ్రేటర్ ఎన్నికల కోసమే చేస్తున్నారనే ఆలోచన రాకుండా చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితి గమనిస్తే కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలు ఒక అంచనాకు వచ్చినట్లే ఉన్నారు.