వైఎస్సార్సీపీ పార్టీ గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అధికారాన్ని చేజిక్కించుకున్నదంటే దానికి ముఖ్య కారణం మాత్రం సీఎం వైఎస్ జగన్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని సాహసం చేసి.. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి లక్షల మంది ప్రజలను కలిసి వాళ్ల సమస్యలు విన్నారు. మీకు నేనున్నాను.. అని భరోసా ఇచ్చారు. ఫలితంగా ప్రజలు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేశారు. జగన్ పార్టీ గెలవడానికి ప్రత్యక్షంగా ప్రజలను కలిస్తే.. వైసీపీకి చెందిన ముఖ్యమైన నాయకులు మాత్రం పరోక్షంగా పార్టీ గెలవడానికి సహకరించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి కూడా ఏడాదిన్నర అవుతుంది. అయితే… వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల్లో ముందు ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సీనియర్ నేతలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? లేక తమ అసంతృప్తిని బయట పెట్టలేకపోతున్నారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
వైసీపీ సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి.. ఇద్దరూ ప్రస్తుతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం సీఎం జగన్ వీళ్లను పట్టించుకోకపోవడమే అన్ని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తమ అసంతృప్తిని సీఎం జగన్ కు చెప్పాలని వీళ్లు ప్రయత్నించినా అది ఫలించలేదట. దీంతో ప్రస్తుతం మౌనంగా ఉండటమే బెటర్ అని వాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం జగన్ కారణం లేకుండా ఏ పనీ చేయరు. వీళ్లిద్దరిని ఆయన కావాలని పట్టించుకోవడం లేదా? వీళ్ల వల్ల ఏదైనా సమస్య వచ్చి పట్టించుకోవడం లేదా? అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది.
కానీ.. ఎలాగూ మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉన్నది కాబట్టి.. ఆ సమయంలో వీళ్లకు ఏదైనా అవకాశం ఇవ్వొచ్చులే అని సీఎం జగన్ భావిస్తుండవచ్చు. అందుకే ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అప్పటి వరకు వీళ్లు వేచి చూస్తే.. వీళ్లకు ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణలో అవకాశం దక్కొచ్చు.. అనే వార్త కూడా వినిపిస్తోంది.