YSRCP : ఏప్రిల్‌లో ఏపీలో రాజకీయ ప్రకంపనలు తప్పవా.?

YSRCP : ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కొత్త మంత్రి వర్గాన్ని ప్రకటించబోతున్నారు. ప్రస్తుత మంత్రి వర్గం నుంచి ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ ఔట్ అయిపోనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవులు కోల్పోయేవారిలో చాలామంది గత కొద్ది రోజులుగా పార్టీ తరఫున గట్టిగా మాట్లాడటమే మానేశారు.

ఇంకోపక్క, కొత్త జిల్లాల ఏర్పాటు కూడా వచ్చే నెలలోనే జరగనుంది. వెరసి, ఏప్రిల్ 15 నాటికి రాష్ట్రంలో రాజకీయ భూకంపం రాబోతోందన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది. అసంతృప్త నేతలు తమ గళం విప్పడానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు.

జిల్లాల లొల్లి పేరుతో కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పటికే గలాటా సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి వుంది.

కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా ఈ రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని తెలిసే, ముందస్తుగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి, పరిస్థితిని చక్కదిద్దేలా చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ఇదిలా వుంటే, ‘రోడ్ మ్యాప్’ అంటూ కొద్ది రోజుల క్రితమే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. వైసీపీ నుంచి చాలామంది నేతలు జనసేనలోకి రాబోతున్నారన్న సంకేతాల్ని ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరోపక్క, టీడీపీ కూడా సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఇంతటి ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఎలా పార్టీని కాపాడుకుంటారు.? ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు.? అన్నది వేచి చూడాల్సిందే.