YS Sharmila: హామీలు ఇచ్చేముందు తెలియదా…. సూపర్ సిక్స్ అమలుపై ఫైర్ అయిన షర్మిల?

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల గత కొద్దిరోజుల వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే ఈమె ధోరణిపై అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. దీంతో గత కొద్దిరోజులుగా షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఈమె సూపర్ సిక్స్ హామీల గురించి చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తూ ఆయన వ్యవహార శైలిపై మండిపడ్డారు. సూపర్ సిక్స్ ఏమైందంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలపై హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం తెలియదా అంటూ మండిపడ్డారు. హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని ఈమె తెలియజేశారు.

ఎన్నికలలో సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు మాత్రం సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఖజానాలో ఏమీ లేవని రాష్ట్రం మొత్తం అప్పుల పాలయింది అంటూ కథలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే సమయంలో రాష్ట్రం అప్పులలో ఉన్న విషయం మీకు తెలియదా? రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా అంటూ వరుస ప్రశ్నలు వేశారు.

కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు బిజెపికి మద్దతు తెలియజేశారు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోలేకపోతే ఎందుకు మీరు బిజెపితో కలిసి చట్టపట్టలేసుకొని నడవాలి అంటూ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ఏదైనా ఉంది అంటే అది ప్రత్యేక హోదా మాత్రమేనని ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని షర్మిల ఫైర్ అయ్యారు.