ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నుంచి రాజధాని తరలింపు విషయంలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో ప్రజా పరయోజనాల పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పిటీషన్ పై ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి నుంచి విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ వ్యతిరేకించడం లేదని ఏవెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు.
అంతే కాకుండా అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, అసలు రాజధాని తరలిపు కారణంగా ప్రభుత్వ ఖజానాకు 5,116కోట్ల భారం పడుతుందనేది అవాస్తవం అని, రాజధాని తరలింపుకు అయ్యే ఖర్చు 70 కోట్ల మాత్రమే అని, ఈ వ్యవహారానికి సంబంధించి తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ అనుబంధ పిటిషన్ వేశారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాష్ట్ర రాజధాని అనేది, భూములు ఇచ్చిన కొందరు రైతులు సొంత వ్యవహారం కాదన్నారు. ఒక రాష్ట్ర రాజధాని అంశం అనేది చాలా కీలకమైనదని, అది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల అందరి హక్కు అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే అని, రైతులు కాదని తేల్చి చెప్పారు.
ఇక గత ప్రభుత్వం ఉన్న సమయంలో రాజధాని కోసం అనేక సార్లు భూకేటాయింపుల జరిగాయని, నాడు స్పందించని సమితి, ఇప్పుడు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డపడుతుందో అని ప్రశ్నించారు. కొందరు రాజకీయనేతలు రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు కాపాడడం కోసమే, అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో పిటీషన్ వేశారు తప్పా, ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలకు ఆస్కారం లేదని తమ పిటీషన్‌లో పేర్కొన్నారు.