కరోనా హాట్ స్పాట్లుగా బడులు

ఏపీ సర్కారు విద్యాసంస్థలను తెరవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. పాఠశాలలు తెరిచిన నాలుగు రోజుల్లోనే రాష్ట్రం వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో 829 మంది మంది టీచర్లతో పాటు, 575  మంది విద్యార్థులకు కొవిడ్‌ సోకింది. అయితే పాజిటివ్‌ వచ్చిన విద్యార్థుల సంఖ్య 900 పైగానే ఉందని … ప్రభుత్వమే లెక్కలు దాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కోవిడ్ రెండో వేవ్ ప్రారంభమైన తర్వాత బడులు తెరవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బడికి వెళ్లకపోతే చదువుల్లో వెనకబడిపోతారని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో కరోనాను సైతం లెక్కచేయకుండా పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో హాజరు శాతం తక్కువగానే నమోదు అవుతోంది. నవంబరు 30  వరకు అన్‌లాక్‌ 5  నిబంధనలు కొనసాగుతాయని కేంద్రం పదే పదే చెప్పినా పిల్లల ఆరోగ్యం గురించి ఎందుకు జగన్ సర్కారు ఆలోచించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఎంత మందికి కరోనా సోకిందనే లెక్కలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రభుత్వంలోని ఇతర శాఖలు చెప్తున్న లెక్కలకు, విద్యాశాఖ వెల్లడిస్తున్న లెక్కలు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు డీఈఓలు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారని సమాచారం. కరోనా సోకిన టీచర్లకు 14 సెలవులు పెట్టుకునే వెసులుబాటు ఇస్తున్న రాష్ట్ర సర్కారు పరిహారం ఊసే ఎత్తడం లేదు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడిని కరోనా బలి తీసుకుంది. పూట బడికి ఇన్ని ఇబ్బందులు పడలా…చక్కగా ఆన్ లైన్ క్లాసులే నడిపించుకోవచ్చు కదా అని  విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.