కాంగ్రెస్ పార్టీతో ఇక లాభం లేదని గ్రహించిన రాములమ్మ ఇప్పుడు బీజేపీ వైపు ఆసక్తి కనబరుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణలో బీజేపీ బలపడిందని ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె కమళం పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నెలాఖరులోగా ఆమె కాషాయపార్టీలో చేరనున్నారని సమాచారం. ఒకవేళ రాములమ్మ బీజేపీలో చేరితే… ఆమెను వరించే పదువులు ఏమిటి ? తద్వారా ఆమెకు కలిగే ప్రయోజనం ఏమిటి? తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ? అనే అంశాలపై చర్చసాగుతోంది. రాములమ్మను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ హామీ ఇచ్చిందని, ఆమె కూడా ఇదే కోరుకుంటున్నారని టాక్. రాములమ్మను రాజ్యసభకు పంపి… తమిళనాడుతో పాటు తెలంగాణలో వీలైతే ఏపీలో కూడా ఆమె సేవలను వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది.
రాజ్యసభ సీటపై హామీ రావడం వల్లే విజయశాంతి కాంగ్రెస్ పార్టీని లెక్కచేయడం లేదని టాక్. అందుకే కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులు వర్క్ అవుట్ కాలేదని సమాచారం. ఏకంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లి విజయశాంతితో రహస్య మంతనాలు జరపడం…ఆతర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం వల్ల రాజ్యసభ సీటుపై ఆమెకు ఇంకా భరోసా పెరిగిందని టాక్. అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ జరిపిన చర్చలను కూడా ఆమె తోసిపుచ్చిట్లు తెలుస్తోంది.
పార్టీ మార్పుపై విజయశాంతి ఒక నిర్ణయానికి వచ్చేశారని త్వరలోనే ఆమె పార్టీ మారబోతున్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నా ఆమె స్పందించకుండా మిన్నకుండిపోవడంతో ఆమె పార్టీ మరాడం ఇక ఖాయమని రాజకీయ వర్గాలు తేల్చిచెప్తున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీని బలపడేందుకు సహకరించే విధంగా ఆమె వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేసీఆర్ మద్ధతుతో టీఆర్ఎస్ నుంచి లోకసభకు ఎన్నికైన విజయశాంతి ఇప్పుడు బీజేపీ మద్ధతుతో రాజ్యసభకు ఎన్నికకాబోతోంది.