పవన్ కళ్యాణ్ రోడ్డెక్కారు. గుంతలు పూడ్చారు. అంతకు ముందు వేలాది వాహనాలతో రోడ్ షో నడిచింది. కరోనా ఆంక్షలు బేఖాతరు అన్నట్టు నడిచింది వ్యవహారం. రాజకీయ విమర్శలు మామూలే. మామూలుగా పవన్ కళ్యాణ్ ఒకింత శ్రద్ధతోనే శ్రమదానం చేసి ఉండాల్సింది. కానీ, ఇక్కడ ఆ అవకాశం ఆయనకు దొరకలేదు. ఫోటోలకు పోజులిచ్చేసి మమ అనిపించేశారు. దాంతో పవన్ కళ్యాణ్‌ని నిజంగా అభిమానించేవాళ్లు కొంత ఆశ్చర్యపోయారు.
రాజకీయం మొదలెట్టాం.. అని చెప్పిన పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ మార్పు చూపించినట్లైంది. ఇదే నేటి రాజకీయం. కొంత సమయం వ్యత్యించి కొంత ప్రాంతం మేర గుంతలు పూడ్చి ఉంటే, ఆ తర్వాత పరిస్థితి ఇంకోలా ఉండేది. వేల మంది పోలీసులు సైతం అదుపు చేయలేనంత గందరగోళం ఏర్పడేదేమో.
ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ శ్రమదానంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పెదవి విరిచారు. గడిచిన రెండున్నరేళ్లుగా వర్షాలు బాగా పడడంతో రాష్ర్టానికి చాలా మేలు జరిగిందనీ, దాంతో పాటే, రోడ్లకు కొంత నష్టం వాటిల్లిందనీ, 2,000 కోట్లు వ్యత్యించి రోడ్లన్నీ బాగు చేయబోతున్నామనీ, సజ్జల చెప్పుకొచ్చారు.
అయితే, వేల కోట్ల ప్రస్థావన ఇక్కడ అనవసరం. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ గుంతల రోడ్ల కారణంగా. చిన్నపాటి తాత్కాలిక మరమ్మత్తులు కొన్ని ప్రాణాలనైనా కాపాడతాయి. ఆ పని రెండేళ్లుగా జగన్ సర్కార్ ఎందుకు చేయలేకపోయింది.? అనేదే అసలు ప్రశ్న. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మీద ప్రభుత్వం విమర్శలు చేయడం అర్ధరహితం. తద్వారా పవన్ కళ్యాణ్‌కి పొలిటికల్‌గా అడ్వాంటేజ్ అవుతుంది. అది వైసీపీకి నష్టం చేస్తుంది.