జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఆలయ భూములకు సంచలన వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇళ్ల స్థలాల కోసం ఆలయ భూములను ఎంచుకున్న ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. ఆలయ భూములను ఇళ్ల స్థలాలుగా చేసి పంచేయడం ఆపేయాలంటూ ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే… ఖాళీగా ఉన్న ఆలయాల భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి… వాటిని పంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాని కోసం భూములకు మార్కింగ్ చేసి హద్దు రాళ్లు కూడా పాతేసింది.
విజయనగరం జిల్లాలోని గుంపం గ్రామంలో ఉన్న ఆలయ భూములను తీసుకున్న ప్రభుత్వం.. వాటిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ప్రభుత్వం మాత్రం గ్రామస్తుల మాటను పెడచెవిన పెట్టి… ఆలయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చడంతో గ్రామస్తులంతా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు… ఆలయ భూములను ఇళ్ల స్థలాలుగా ఎలా మారుస్తారు? వాటిని ఇళ్ల స్థలాలుగా చేసి పంచేయడం ఎక్కడైనా ఉందా? అంటూ కోర్టు ప్రభుత్వం తరుపు లాయర్ ను ప్రశ్నించింది.
దీనిపై ప్రభుత్వం 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని… అప్పటి వరకు ఆలయ భూముల విషయంలో ఎటువంటి చర్యలను ఉపక్రమించొద్దంటూ కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని పంచితే ఓకే కానీ… మైనింగ్ భూములు, ఆలయ భూములు, చెరువు భూములు, స్మశానం భూములు.. అన్నింటినీ సేకరించి వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చితే ఊరుకునేది లేదని.. అన్ని గ్రామాల వాసులు అభ్యంతరం తెలుపుతున్నారు.