ఇదేనా మన భారతం..!?

(విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఇంట్లో తల్లి నిద్రపుచ్చిన అయిదు నెలల పసికందుపై నలభై ఏళ్ల మానవ మృగం అత్యాచారం.. ఇదెంత హేయం రాయడానికే ఇబ్బంది అనిపిస్తున్న ఈ ఘాతుకంపై నా స్పందన).

ఏం జరుగుతోంది మన సమాజంలో.. రోజుకో కోణంలో కనిపిస్తుందేమిటి మనిషి నైజం ఏదో రూపంలో ఆడకూతురుపై దౌర్జన్యమేనా.. మనం నేర్చిన చదువు.. గురువులు చెప్పిన బుద్దులు.. పెద్దలు బోధించిన సుద్దులు.. చిన్నతనంలో అమ్మానాన్న నేర్పిన పాఠాలు.. తాతలు బామ్మలు చూపిన బాటలు.. జీవితంలో అనుభవాలు నేర్పిన గుణపాఠాలు… సంస్కృతి నేర్పిన సంస్కారం.. రామాయణం చూపిన మార్గం.. ఏమైపోయాయి ఇవన్నీ..!?

అసలు ఏమిటీ విపరీతం.. ఏమైపోయింది మనిషిలోని ఇంగితం.. పసిగుడ్డుపై అత్యాచారమా.. తనకు ఏం తెలుసని.. నోరెత్త లేదనా.. ఈ అకృత్యం.. అసలతడు మనిషేనా.. పశువులు సైతం తెగబడని హీనకార్యం.. అది అతడికి ఘనకార్యమా.. అడిగేవాడే లేడనా.. మానవతే లేదనా.. రాక్షసులు ఇలా చేయలేదే.. రాతి యుగంలో సంస్కారం ఎరగని మనుషులైనా అలా ప్రవర్తించి ఉంటారా..!?

ఓ మనిషి పశువుగా మారి.. అంత చిన్నారిని.. ఇంత కర్కశంగా.. మంచి మరచి.. విజ్ఞత విడిచి.. విచక్షణ విస్మరించి.. మానవతను మంటగలిపి. దానవతను కలగలిపి.. దౌర్జన్యం చేయడం..ఛీ..!

ఇలాంటి పైశాచికాలకు ఇక చరమగీతం పలకాలి.. ప్రభుత్వాలు కదలాలి న్యాయస్థానాలు స్పందించాలి.. ముష్కరులను సత్వరమే శిక్షించాలి.. రేపు మరో రాక్షసుడు లేవకుండా.. ఎల్లుండి ఇంకో అకృత్యానికి తావు లేకుండా.. కఠిన దండన..!

వచ్చినా రాకున్నా ఆ కర్కోటకుడిలో పరివర్తన.. అది రేపటి మరో కంటకుడికి కాదా హెచ్చరిక.. ఇదే..ఇదే.. ఈ వేదభూమిలో ప్రతి తల్లి పొలికేక..!