అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి.. ఎన్టీఆర్ విషయంలో మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల విజయనగరంలోని ఎన్టీఆర్ పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ కి వైయస్సార్ పేరు పెట్టడంతో రాష్ట్రంలో వివాదం నెలకొంది. ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నాయకులతో పాటు దివంగత నేత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదితరులు ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ప్రజలలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించలేరు అలాగే వైఎస్ఆర్ స్థాయి పెరగదని ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించాడు . ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ యాదవ్ స్పందిస్తూ.. దివంగత నేత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని .. అందుకే జిల్లాల విభజన సమయంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరుని పెట్టినట్లు స్పష్టం చేశారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ విషయం గురించి హర్షించకపోవడం శోచనీయం అంటూ ఎద్దేవా చేశాడు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేసి లాక్కున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ బాధ అతని కుటుంబ సభ్యులకు పట్టలేదా? అంటూ ప్రశ్నించాడు. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి.. అంటూ అనిల్ యాదవ్ మండిపడ్డారు. అంతేకాకుండా తాత కోసం ఇలా ట్వీట్లేయటం కాదు.. తొడ కొట్టాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేరు ప్రస్తావించకుండా సవాలు చేసారు.