విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం కొన్ని రోజుల కిందట సంచలనం అయింది. స్వర్ణ ప్యాలెస్ లో రమేశ్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వాళ్లు ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ లో చాలామంది కరోనా పాజిటివ్ వ్యక్తులు, కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.
అయితే.. ఈ నెల 9న స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా… మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.
ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం… రమేశ్ ఆసుపత్రిపై చర్యలకు ఉపక్రమించింది. ఖచ్చితంగా రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని గ్రహించి.. ఆసుపత్రికి కోవిడ్ కేర్ సెంటర్ అనుమతులను రద్దు చేసింది. దానితో పాటు హాస్పిటల్ ఎండీ రమేశ్ బాబుతో పాటు హాస్పిటల్ కు చెందిన పలువురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే.. తమపై అకారణంగా కేసు నమోదు చేశారని.. తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ రమేశ్ ఆసుపత్రి ఎండీ రమేశ్ బాబు, చైర్మన్ సీతారామ్మోహన్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు… అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి రమేశ్ ఆసుపత్రి ఎండీ, చైర్మన్ పై చర్యలు తీసుకోకుండా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.