విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఉన్న క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించడంతో.. క్వారంటైన్ లో ఉన్న 10 మంది కరోనా బాధితులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డాక్టర్ రమేశ్ బాబుతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. రమేశ్ హాస్పిటల్ యాజమాన్యం.. స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ క్వారంటైన్ సెంటన్ ను ఏర్పాటు చేసింది. దీంతో హాస్పిటల్ మీద, రమేశ్ మీద కేసు నమోదు చేశారు.
అయితే.. ఆ అగ్ని ప్రమాదానికి, తమకు ఎటువంటి సంబంధం లేదని.. ఆ కేసును కొట్టేయాలని రమేశ్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. రమేశ్ బాబుతో పాటు.. ఆసుపత్రి సీఈవో సీతారామ్మోహన్ రావు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టులో ఆయనపై తదుపరి చర్యలను తీసుకోకుండా నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులను కోర్టు అప్పట్లోనే జారీ చేసింది.
తాజాగా.. హైకోర్టు.. ఈ కేసు వ్యవహారంపై డాక్టర్ రమేశ్ బాబును ప్రశ్నించేందుకు పోలీసులకు అనుమతించింది. మూడు రోజుల పాటు ఆయన్ను అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో విచారించాలని తెలిపింది. ఈనెల 30 వ తారీఖు నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన్ను విచారించాలంటూ పేర్కొంది.