విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గానే ఉందని మంత్రులు బొత్సా సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రులు ముగ్గురు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల భద్రతకోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన సమస్య అది. అయినా ప్రభుత్వం ఘటనపై సీరియస్ గానే ఉంది. మృతదేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్ జీ పాలిమర్స్ పై సీరియస్ గానే ఉన్నారని….ప్రభుత్వంతో పాటు కంపెనీ సైతం నష్ట పరిహారం చెల్లించేలా చర్యలకు సిద్దమవుతున్నారని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రజలంతా పరిస్థితిని అర్ధం చేసుకోవాలని బోత్సా కోరారు. ఇలాంటి సున్నితమైన సమయంలో విపక్షాలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని సూచించారు. రాజకీయాలేమైనా ఉంటే తర్వాత మనం మనం చూసుకుందామని.. ఇప్పుడు ప్రజలతో ఆటలాడుకోవద్దని విపక్షాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజలు చెప్పినట్లు, విపక్షాలు చెప్పినట్లు ఘటనపై అన్ని రకాలుగా విచారణ జరిపే బాధత్య ప్రభుత్వంపై ఉందని…ఘటనకు కారకులైన ఎవర్నీ విడిచిపెట్టబోమని..ప్రజలెవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదని మంత్రులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 10 లక్షలు, సమీప గ్రామస్తులైన ఒక్కో కుటుంబానికి 25 వేలు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.