ఏపీ ప్రభుత్వ జీవోలు ఇకపై ప్రజలకు కనిపించవ్.!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జీవోలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టడం ఇకపై జరగదు. చాలా ఏళ్ళుగా ప్రభుత్వ జీవోలు ప్రజలకు తెలిసేలా ఓ పద్ధతి నడుస్తూ వస్తోంది. తద్వారా ప్రభుత్వ పాలన అత్యంత పారదర్శకంగా జరుగుతోన్న భావనని ఆయా ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేసేందుకు వీలు పడేది. అయితే, ఇటీవలి కాలంలో ప్రతి జీవో వివాదాస్పదమవుతూ వస్తోంది.. మారిన రాజకీయాల నేపథ్యంలో. ఇలా జీవో రావడం, అలా వివాదం షురూ అవడం, ఆ తర్వాత కోర్టు కేసులు.. ఇదో ప్రసహనమైపోయింది. ఇంకోపక్క, జీవోల విషయంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. దాంతో, ప్రభుత్వం.. ఇకపై జీవోల్ని ప్రజలకు అందుబాటులో వుంచకూడదనే నిర్ణయానికి వచ్చిందట.

ఇంతకీ, జీవోలు ప్రజలకు అందుబాటులో లేకపోతే ఏమవుతుంది.? మీడియా పరిస్థితేంటి.? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. జీవోల గురించి ప్రజల్లో అవగాహన పెరగాలి. జీవోల్లోని అంశాల గురించి ప్రజలకు తెలియాలి. అప్పుడే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు పారదర్శకమైన పాలన అందించినట్టు లెక్క. సరే, ఆ జీవోలో అంశాలపై విపక్షాలు గగ్గోలు పెట్టినంతమాత్రాన, ప్రజలు వ్యతిరేకించినంతమాత్రాన ప్రభుత్వాలు వెనక్కి తగ్గుతాయనీ, జీవోల్ని వెనక్కి తీసుకుంటాయనీ అనలేం. గత కొద్ది రోజులుగా జగన్ సర్కారు రహస్య జీవోలు విడుదల చేస్తోందంటూ టీడీపీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఈ మేరకు గవర్నర్‌కి కూడా టీడీపీ నేతల బృందమొకటి ఫిర్యాదు చేసింది. ఇంతలోనే, జీవోల విడుదలకు సంబంధించి ఆన్‌లైన్‌లో పొందుపర్చడం అనే ప్రక్రియకు ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. మొత్తమ్మీద, ఈ వివాదం జగన్ సర్కార్ పట్ల ప్రజల్లో కొత్త అనుమానాలకు తావిస్తుందన్నది నిర్వివాదాంశం.