ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ కు తప్పులు చేయటం పెద్ద విషయం, కాదు,వాటిని సరిదిద్దుకోవటం కూడా పెద్ద విషయమేమి కాదన్నట్లు అయిపోతుంది పరిస్థితి. జగన్ సర్కార్ చేస్తున్న కొన్ని తప్పులు ప్రజల దృష్టికి వచ్చినప్పుడో లేక కోర్టుల్లో బయటపడినప్పుడో హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేస్తుంది తప్పితే, ముందుగా జరిగిన తప్పును గ్రహించి సర్దుబాటు చేసుకోవటం లేదు.
రైతుల బీమా విషయంలో అదే పొరపాటు
తాజాగా నిన్నటి అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు సస్పెండ్ కు కారణమైన రైతుల బీమా విషయంలో మొదట వైసీపీ సర్కార్ తప్పుడు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే బీమా మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించామని చెప్పింది. దీనితో టీడీపీ అసలు నిజం బయట పెట్టెసరికి డిసెంబర్ 15 లోపు చెల్లిస్తామని మాట మార్చింది. దీనితో అసెంబ్లీ లో రచ్చ షురూ అయ్యింది. ఇక ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర సర్కార్ రాత్రికి రాత్రి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది.
రాత్రికి రాత్రి
రైతుల తరపున.. ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని హడావుడిగా నిన్న రాత్రి విడుదల చేశారు. రూ. 590 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తూ..ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైఎస్ఆర్ – ఫసల్ బీమా యోజన పథకం కింద ఆ మొత్తం చెల్లిస్తున్నట్లుగా ప్రకటించారు.అయితే ఇప్పుడు కట్టిన ఇన్సూరెన్స్ ఇప్పటి నుండి వర్తిస్తుంది కానీ.. ఇప్పటి వరకూ జరిగిన నష్టానికి వర్తించే అవకాశాలు లేవు. గత ఏడు నెలల కాలంలో జరిగిన నష్టానికి ఇన్సూరెన్స్ కంపెనీలు.. రైతులకు నష్టపరిహారం చెల్లించవు. ఇక ముందు జరిగే నష్టానికి మాత్రం… కట్టిన ప్రీమియం మేరకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది.
హద్దురాళ్లపై సీఎం జగన్ బొమ్మ
జగన్ సర్కార్ తాము చేసిన తప్పు బయటపడే సరికి దానిని సరిదిద్దుకోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోతున్న భూసర్వే లో హద్దురాళ్లు ఏర్పాటు చేసే విషయంలో అధికారులు ఉత్సహానికి పోయి హద్దురాళ్ల మీద ఏకంగా జగన్ బొమ్మ చెక్కించటం అప్పట్లో సంచలనం అయ్యింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత రావటంతో అప్రమత్తమైన నేతలు అందుకు భాద్యులైన అధికారులను పిలిచి హెచ్చరించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండానే కిందిస్థాయి అధికారులు వాటిని చెక్కించి జగన్ అనుమతి కోసం అమరావతికి తీసుకోని రారు కదా..?
ఎన్నికల సంఘం నిధులు విషయంలో
రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కార్ కు మధ్య అనేక వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే, జగన్ సర్కార్ చట్టబద్ధంగా ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు దృష్టికి తీసుకోని వెళ్లటంతో, ఆ విషయంలో కోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి తలంటు పోయటంతో ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన దాదాపు 40 లక్షల నిధులను రాత్రికి రాత్రి విడుదల చేశారు .
జగన్ సర్కార్ కావాలని చేస్తుందో, తెలియక చేస్తుందో కానీ అనేక తప్పు చేయటం అవి బయటపడి పరువు పోయిన తర్వాత వాటిని సరిదిద్దుకోవటం చేస్తుంది. సరే సీఎం జగన్ కు పరిపాలన కొత్తే కావచ్చు, కానీ పదుల సంఖ్యలో ఉన్న సలహాదారులు ఏమి చేస్తున్నట్లు, పరిపాలన పరంగా అనుభవం కలిగిన సీనియర్ అధికారులు ఏమి చేస్తున్నట్లు..? ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ ఇలాంటి విషయంలో కొంచం ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు