అటు ఆర్తనాదాలు.. ఇటు అసెంబ్లీలో భజనపరులు.!

విపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తే అది వేరే లెక్క. ప్రజలే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంటే.. ప్రభుత్వం ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలించాలి.. ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. కనీ వినీ ఎరుగని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రసలు తాగు నీటికి కటకటలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ సభ్యులు ప్రశంసలు కురిపించడం ఎంతవరకు సబబు.? పదవుల్ని కాపాడుకునేందుకో, పదవుల్ని పొందడం కోసమే అధినేత మెప్పు కోసం నానా తంటాలూ పడుతుండడం అనేది రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కానీ, సమయం.. సందర్భం వుంటాయి.. వాటికైనాసరే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం, అసెంబ్లీలో ఈ తరహా భజనపరుల్ని ప్రోత్సహించడం అస్సలు సబబు కాదు. ఇలాంటివారిని వారించడం ముఖ్యమంత్రి బాధ్యత. ‘కుటుంబ సభ్యుల్ని కోల్పోయి, నిలువ నీడను కోల్పోయి మేం ఏడుస్తోంటే.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో భజన చేయించుకుంటారా..’ అని బాధిత ప్రజానీకం వాపోతున్నారు.

విపక్షాలకు చెందిన నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, ముఖ్యమంత్రి మీద చేసే విమర్శల్ని అధికార పార్టీ పట్టించుకోకపోవచ్చుగాక. కానీ, ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందే. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ప్రయత్నించాలి. ఆ దిశగా ప్రభుత్వం తరఫున వేగవంతమైన చర్యలు కనిపిస్తున్నా.. అసెంబ్లీలో నడుస్తున్న భజన కారణంగా.. ప్రభుత్వ పెద్దలు, ప్రజల్లో పలచనైపోతున్నారు.