ఏపీ సీఎం వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ద్వారా కనీవిని ఎరుగని స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోవడానికి పాదయాత్ర కారణమని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భావిస్తారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రజలను కలవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ప్రత్యక్షంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జగన్ అస్సలు ఆసక్తి చూపడం లేదు.
రచ్చబండ తరహా కార్యక్రమం ద్వారా జగన్ ప్రజల్లోకి వస్తారని ప్రచారం జరిగినా ఆ కార్యక్రమం దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తలతో సమావేశాలు జరపడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసిన జగన్ సామాన్య ప్రజలను కలవడాన్ని మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రజల ఓట్లతోనే సీఎం అయిన జగన్ ప్రజలను కలవడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది.
2024 ఎన్నికల ఫలితాలు షాకిస్తే జగన్ ప్రజలను కలిసే దిశగా అడుగులు వేస్తారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఏపీ ప్రజలలో చాలామందికి సంక్షేమ పథకాలు అందుతున్నా అభివృద్ధి విషయంలో, తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిలవుతున్న విషయంలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్ విషయంలో ఒకింత అసంతృప్తితో ఉన్నారు.
గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల వల్ల ప్రజలకు పథకాలు అందుతుండటంతో తమకు పదవులు ఉన్నా ప్రత్యక్షంగా ప్రజలను కలిసి సమస్యలను పరిష్కరించడానికి సాధ్యం కావడం లేదని కొంతమంది చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజల మెప్పును పొందడంలో జగన్ ఫెయిలవుతున్నారని ఆచితూచి జగన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.