ఈనెల 23న ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. తిరుమలలో త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి కదా. తిరుమల ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ల తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలి. అందుకే.. సీఎం జగన్ కు తిరుమల అర్చకుల నుంచి ఆహ్వానం అందింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్.. రెండు రోజుల పాటు తిరుమలలోనే బస చేయనున్నారు. సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల రానున్నారు.
23న సీఎం జగన్ తిరుమల చేరుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ రోజున శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని… అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొననున్నారు.
అలాగే.. తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో యడ్యురప్పతో పాటు సీఎం జగన్ కూడా పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని అల్పాహారం స్వీకరించి.. అక్కడి నుంచి డైరెక్ట్ గా జగన్ తాడేపల్లికి చేరుకుంటారు.
ఇక.. ఈసారి తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం రోజున కాకుండా.. సీఎం జగన్ గరుడసేవ రోజున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.