పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ ప్రభుత్వం చాలా రోజుల నుంచి అసహనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి.. ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో తాత్సారం చేస్తన్న సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో… పోలవరంపై సీఎం జగన్ ప్రధాని మోదీకి ఏడు పేజీల లేఖను రాశారు. పోలవరం నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని జగన్.. లేఖలో కోరారు. ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసాల కోసం కూడా మొత్తం 47,725 కోట్ల రూపాయలను విడుదల చేయాలని జగన్ లేఖలో కోరారు.
పోలవరం ప్రాజెక్టును కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. పునరావాసం బాధ్యతను కూడా కేంద్రమే తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రకారం కేంద్రం నడుచుకోవాలని వైసీపీ నేతలు కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యేకొద్దీ.. దాని నిర్మాణ వ్యయం పెరుగుతోందని.. ఏపీ ప్రభుత్వం చెబుతోంది.