ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ తో కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఇరువురి మధ్య అరగంటపాటు భేటీ జరిగింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గవర్నర్ ని కలిసి రెండు రోజులు గడిచిన అనంతరం సీఎం కలవడంతో భేటీపై ఆసక్తి సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. గత కొంతగా కాలంగా ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితులను జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది. సీఆర్ డీఏ బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లుల విషయంలో శాసనమండలిలో జరిగిన తీరును వివరించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
అలాగే వైకాపా నుంచి ఇద్దరు మంత్రులు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కేబినేట్ లో మార్పులు కూడా అనివార్యమైన నేపథ్యంలో దానిపై చర్చ సాగి ఉంటుంది. అలాగే రాష్ర్టంలో రోజు రోజుకి కరోనా కేసులు కూడా పెరుగుతుండటం…నివారణకు తీసుకుంటోన్న చర్యల గురించి గవర్నర్ కు వివరించి ఉంటారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజులో భాగంగా గవర్నర్ ప్రసగించిన సంగతి తెలిసిందే. ఆ ప్రసంగంలోనే మూడు రాజధానుల అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
అన్ని ప్రాంతాలు అభివృద్ది లోకి రావడంలో మూడు రాజుధానులు నిర్ణయం సరైనిదేనని గవర్నర్ తెలిపారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక జగన్ గవర్నర్ కలవడానికి రెండు రోజుల ముందుగానే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. ఈ సందర్భంగా తమ పార్టీ నేతలపై జరుగుతోన్న అరెస్ట్ లు, అధికార పక్షం ఏడాది పాలన, తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.