ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మీద వరాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్.. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబుర్లు అందిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కావాలంటే డిపార్ట్ మెంటల్ టెస్టులు రాయాలి. వాటి ద్వారానే ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తుంటారు. అయితే.. డిపార్ట్ మెంట్ టెస్టుల్లో ఇప్పటి వరకు నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. దీని వల్ల డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో పాస్ అవడం వాళ్లకు కష్టంగా మారింది.
నిజానికి నెగెటివ్ మార్కింగ్ విధానం 2016లో అప్పటి ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చింది. టీడీపీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో ఒక ప్రశ్నకు సమాధానం తప్పు అయితే 1/3 వ వంతు మార్కులను తగ్గిస్తారు. దీనిపై అప్పటి నుంచి ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వం ఆ విధానాన్నే కొనసాగించింది.
అయితే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని తీసేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఉద్యోగ సంఘాలు విన్నవించాయి. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. డిపార్ట్ మెంటల్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
దీని వల్ల లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. పదోన్నతులు పొందేందుకు మార్గం ఇంకా సులభం కావడంతో… ప్రభుత్వ ఉద్యోగులంతా ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను కొనియాడుతున్నారు.