ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్: ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన

హమ్మయ్య ఓ దరిద్రం వదిలిపోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కనిపించబోవట.! ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధించబోతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. విశాఖ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు.

ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని ఏళ్ళుగా పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. ప్రధానంగా సముద్ర జలాలు ప్లాస్టిక్ వల్ల నాశనమైపోతున్నాయి. సముద్రంలో జీవించే అనేక జీవజాతులు ప్లాస్టిక్ వల్ల తమ ఉనికిని కోల్పోతున్నాయి.. అనేక జీవజాతులు ఇప్పటికే అంతరించాయి కూడా.

నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం అనేది మనిషికి తప్పనిసరైపోయింది. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. అది లేకుండా ఏ పనీ జరగడంలేదు. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ మీద నిషేధం కొనసాగుతోంది. అయినాగానీ, చాపకింద నీరులా.. వాటి అమ్మకాలు జరుగుతున్నాయి.

ఫ్లెక్సీల పరిస్థితి వేరు. వాటి వల్ల కలిగే నష్టమూ వేరు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు జనం ప్రాణాల్ని తోడేస్తున్న వైనం పలు మార్లు నిరూపితమయ్యింది కూడా. అయినాగానీ, ప్రభుత్వాలు ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధించలేకపోయాయి. ఈ రంగంపై ఎన్నో జీవితాలు ఆధారపడి వుండడమూ అందుక్కారణం కావొచ్చు. వేలాది మంది లక్షలాది మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

రాజకీయ పార్టీల ఫ్లెక్సీలపై వివాదాలు, ఆ కారణంగా జరుగుతున్న హత్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తే, చాలా వరకు రాజకీయ తగాదాలే కాదు, సామాజిక తగాదాలూ తగ్గిపోతాయేమో.! కానీ, పిల్ల మెడలో గంట కట్టేదెలా.? అదంత తేలికైన వ్యవహారం కాదు.