గత కొన్ని రోజుల నుంచి ఏపీ పంచాయతీ ఎన్నికల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్రంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ సమాయత్తం అవుతోంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉన్న నేపథ్యంలో ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ.. ఎన్నికల సంఘం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ పట్టుబట్టింది. హైకోర్టు దాకా వెళ్లింది ఈ వ్యవహారం.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి రాష్ట్రంలో తగ్గడంతో వచ్చే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటు… కరోనా జాగ్రత్తలపై వైద్య శాఖ అధికారులతోనూ చర్చించింది.
ఈసందర్భంగా నిమ్మగడ్డ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కరోనా ప్రస్తుతం అదుపులో ఉందని.. గతంలో రోజూ 10 వేల కేసులుంటే.. ప్రస్తుతం వెయ్యి కేసులు కూడా నమోదు కావడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.