నిమ్మగడ్డ అనూహ్య నిర్ణయం.. రిటైర్మెంట్‌ కు ముందు ఊహించని..

Reverse gear on SEC nimmagadda

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి 21 వరకు ఆయన సెలవు పెట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. మార్చి 31న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం దాదాపుగా కుదరకపోవచ్చు. ఎస్ఈసీ సెలవు మీద వెళ్తుండటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లినట్లయ్యింది. గత ఏడాది మార్చిలో నామినేషన్లు వేసిన వారు.. ఏడాది నుంచి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

Nimmagadda sensational decision on ZPTC, MPTC elections!
Nimmagadda

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఆశించారు. జనాలను ప్రసన్నం చేసుకోవడం కోసం కరోనా సమయంలో సేవా కార్యక్రమాల నిర్వహణకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టారు. కొత్త ఎస్ఈసీ వచ్చినా, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే జరిగే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఈ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కొత్త జిల్లాల అంశం తెర మీదకు వస్తే.. రిజర్వేషన్లు సైతం మారే అవకాశం ఉంది. అదే జరిగితే తమ పరిస్థితి ఏంటని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

కరోనాను చూపి గత ఏడాది మార్చిలో ఎన్నికలను వాయిదా వేయించిన నిమ్మగడ్డ.. ప్రభుత్వం సిద్ధంగా లేమని చెబుతున్నప్పటికీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. జగన్ సర్కారు న్యాయపోరాటానికి దిగగా, వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జగన్ సర్కారు దిగొచ్చింది. ఎన్నికల వేళ సెలవు పెట్టిన తన కింది అధికారులపై వేటు వేసిన నిమ్మగడ్డ, రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందు, జడ్పీటీసీఎ, ఎంపీటీసీల ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిసినా సెలవు మీద వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.