AP Capital Row : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై తలెత్తిన గందరగోళానికి త్వరలో, అతి త్వరలో పూర్తి స్థాయి స్పష్టతతో ‘ముగింపు’ ఇవ్వబోతున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. త్వరలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న దరిమిలా, ఈ సమావేశాల్లోనే ‘సరైన స్పష్టత’ రాబోతోందని అంటున్నారు.
మూడు రాజధానుల బిల్లుని మళ్ళీ తీసుకొస్తారా.? లేదంటే, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ, ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘ప్రస్తుత రాజకీయ గందరగోళం నేపథ్యంలో అమరావతినే కొనసాగించబోతున్నాం.. ముందు ముందు పరిస్థితుల అనుకూలతను బట్టి, మిగతా రెండు రాజధానులపై ముందడుగు వేస్తాం..’ అని జగన్ సర్కారు చెప్పబోతోందంటూ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉద్యోగుల ఆందోళనలు ఎలాగైతే ప్రభుత్వం దిగొచ్చిందో, అదే రీతిన అమరావతి రైతులతోనూ చర్చలు ప్రారంభమవుతాయని అంటున్నారు.
‘చంద్రబాబు హయాంలో జరిగిన అంచనాల మేరకు రాజధాని నిర్మాణం సాధ్యం కాదనీ, తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామనీ’ వైఎస్ జగన్ సర్కార్ చెప్పబోతోందన్నది తాజా ఊహాగానాల సారాంశం. అయితే, మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పుట్టుకొచ్చే ఆందోళనలకు ఎలా సమాధానమివ్వాలన్నదానిపై జగన్ సర్కారు కసరత్తులు చేస్తోందట.
ఇదిలా వుంటే, కొత్త జిల్లాలకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సర్కారు మరింత స్పష్టతనివ్వబోతోందట.