కమలం పువ్వుల అతి పరాకాష్టకి చేరిపోయింది. ఔను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. కేంద్రం ఇటీవల పెట్రోలు మీద ఐదు రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు ఎక్సైజ్ పన్ను తగ్గించిన మాట వాస్తవం. మంచి ఆలోచనే ఇది.
రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించుకోవాలనీ, సామాన్యుడికి ఊరట కల్పించాలనీ కేంద్రం కోరడాన్నీ తప్పు పట్టలేం. కానీ, అసలు పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయ్.? ఇంత దారుణంగా ఎందుకు పెంచాల్సి వచ్చింది.? అన్న ప్రశ్నకు తొలుత బీజేపీ ప్రభుత్వం సమాధానమివ్వాలి.
యూపీఏ హయాంలో ఏడాదికో, ఆర్నెళ్ళకో లీటరు డీజిల్ లేదా పెట్రోలు మీద రెండు మూడు రూపాయలు పెరిగితే నానా యాగీ చేసిన బీజేపీ, ఇప్పుడేమో ఏకంగా పది, పాతిక పెంచుకుంటూ పోయింది. రోజువారీ ప్రాతిపదికన అడ్డగోలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి.
చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో వంద రూపాయలు దాటేశాయి పెట్రోల్, డీజిల్ ధరలు. ఇంతలా దేశాన్ని, దేశ ప్రజల్నీ దోచేశాక.. ఇప్పుడు తీరిగ్గా కాస్త తగ్గించి, పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది.
ఇలా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రో ధరలపై తగ్గించిందో లేదో.. అలా రాష్ట్రాల మీద పడ్డారు కమలం నేతలు. రాష్ట్రాలు పన్నుల్ని తగ్గించాల్సిందే. కానీ, కేంద్రం ప్రజల జేబులకు చిల్లు పెట్టి తద్వారా సంపాదించిన సొమ్ముల్ని ఏం చేసిందో సమాధానం చెప్పి తీరాలి.
నిజానికి, కేంద్రం తగ్గించాల్సింది ఐదు, పది రూపాయలు కాదు.. 20 నుంచి 30 రూపాయలు తగ్గిస్తేనే తప్ప దాన్ని ఉపశమనం అనుకోలేం. అలాంటిది ఐదు రూపాయలు, పది రూపాయలు తగ్గించేసి పండగ చేసుకోమనడం కమలం పువ్వులకే సాధ్యమయ్యిందేమో.