AP BJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ.. పబ్లిసిటీ బ్యాచ్ మాత్రమే.!

AP BJP :  రాజకీయాల్లో ఎవరి వాదనల్ని వారు బలంగా వినిపించొచ్చు. అధికారంలోకి రావాలని ఎవరైనా ఆశపడొచ్చు. ప్రజలు మెచ్చితే, అధికారంలోకి ఎవరైనా రావొచ్చు. కానీ, మాటలు కోటలు దాటేస్తూ.. చేతలు గడప కూడా దాటకపోతే, అలాంటోళ్ళని రాజకీయాల్లో ‘హాస్యగాళ్ళు’ అనాలా.? ‘పిట్టలదొరలు’ అనాలా.? అన్న సంశయం వస్తుంటుంది ప్రజలకి.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు అత్యంత దారుణంగా, జుగుప్సాకరంగా వుంటున్నాయంటే, అందుక్కారణం ఆయా నేతలు చేస్తున్న వ్యాఖ్యలే. నూరు ఆరైనా, ఆరు నూరైనా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చది తామేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా అభివర్ణిస్తున్నారు కమలం పార్టీ నేతలు.

రాయలసీమ ప్రాజెక్టులపై ఎందుకు దృష్టిపెట్టలేదు.? అమరావతి ఎందుకు కట్టలేదు.? అంటూ బీజేపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ పక్కన పెడదాం, ఆంద్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది.? ఏం చేయాల్సి వుంది.?

దేశ రాజధాని ఢిల్లీ తరహాలో అమరావతి నిర్మితమవ్వాలి.. అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఏదీ, ఆ స్థాయి సాయం రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిందా.? లేదు కదా.! పోలవరం ప్రాజెక్టు విషయంలో రీ-ఎంబర్స్‌మెంట్ నిధుల్నే కేంద్రం విడుదల చేయడంలేదాయె.

ఇవన్నీ పక్కన పెడదాం.. తాజా వివాదం విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వద్ద ఏపీ బీజేపీ నేతల ‘స్థాయి’ ఏంటి.? ఆ ప్రైవేటీకరణను ఏపీ బీజేపీ నేతలు ఆపగలిగినా.. కాసిని ఓట్లు బీజేపీకి పడతాయేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చేవలేని మాటలకే పరిమితమవుతూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ఏపీలో బీజేపీ చేసే రాజకీయాలు నవ్వులపాలవుతున్నాయ్.