ముఖ్యమంత్రి వైఎస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి పై సొంత పార్టీ నేతల కుంపటి పెడుతున్నారా? ఆధిపత్య పోరులో జగన్ కే ఎసరు పెట్ట ప్రయత్నాలు రాష్ర్టంలో కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. ఏ పార్టీలోనైనా ఆధిపత్య పోరు..అంతర్గత కుమ్ములాట సహజం. అయితే వైసీపీ లో అదికాస్త అతిగానే ఉందనిపిస్తోంది. వైఎస్సార్ బొమ్మ చూపించి గెలిచిన నేతలే ఇప్పుడు పార్టీపై తిరగబడుతున్నారు. ఈ విషయంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు ముందు వరుసలో ఉన్నారన్నది ప్రజలకి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో రఘురామకృష్ణమారజు కారణంగా ఆ నియోజకవర్గంలో కుమ్ములాటైతే మొదలైంది.
అలాగే కడప, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కూడా ఇదే తరహా వైరం మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూడు జిల్లాల్లో సొంత పార్టీ నేతల మధ్య ఆజ్యం పోస్తున్నది పసుపు తమ్ముళని అంటున్నారు. తమకు అనుకూల మీడియాలో వైసీపీ నాయకులపై వ్యతిరేక కథనాలు రాయించి వాళ్లలో వాళ్లే కుమ్ములాడుకునే చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జరుగుతోన్న ఆధిపత్య పోరులో భాగంగా ఈ కథనాల్ని మీ పార్టీ వాళ్లే వ్యతిరేకంగా రాయించారని..వాళ్లలో వాళ్లే దూషణలకు దిగేలా దాష్టికాలకు తెగబడుతున్నట్లు సమాచారం. పచ్చ తమ్ముళ్లు చేస్తోన్న ఈ ప్రయత్నాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బట్టబయలు చేసినట్లు తెలస్తోంది.
తనపై కావాలనే కొందరు టీడీపీ నేతలు వ్యతిరేక కథనాలు రాయించి సొంత పార్టీలో గొడవలకు కారకులు అవుతున్నారని ఆగ్రహం చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై నే టీడీపీ నేతలు ఇలాంటి చర్యలకే పాల్పడి దొరికిపోయారని ఈ సందర్భంగా వెలుగులో కి వచ్చింది. సిద్ధార్థ్ కి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యే అర్థర్ తోనే ఈ చర్యలకు పూనుకున్నట్లు ప్రచారానికి తెర లేపరని అంటున్నారు. అలాగే గన్నవరం లో వల్లభనేని వంశీ-దుట్టా రామచంద్రరావు మధ్య కూడా పచ్చ తమ్ముళ్లే నిప్పులు పోస్తున్నట్లు..ఆ కారణంగానే దుట్టా వర్గీయులు..వంశీ వర్గీయులు వైసీపీ కోసం కలిసి పనిచేయలేకపోతున్నారని కొత్త ప్రచారం ఒకటి తెరపైకి వస్తోంది.