ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. దుబ్బాక ఉపఎన్నికలో ఓడిపోవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు తక్కువ రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీది. ఇక.. ఇలాగే ఉంటే నడవదు.. అని గ్రహించి సీఎం కేసీఆర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం పూర్తిగా పాలనపై దృష్టి పెట్టారు. పార్టీలోనూ ప్రక్షాళన ప్రారంభించారు.
అందుకే కీలకమైన నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారు. ఇటీవలే వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచారు. ఎల్ఆర్ఎస్ కూడా అవసరం లేకుండానే వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చంటూ ప్రకటించారు.
అయితే.. ఇదంతా దేనికోసం అంటే త్వరలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం. అవును.. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీల ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటన్నింటిలో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవెయ్యాలంటూ కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదని గ్రహించిన సీఎం కేసీఆర్.. వరాల జల్లులను ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో పార్టీలో పరిస్థితులన్నీ తారుమారు అవుతున్నాయి. ఒకవేళ.. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఓటమినే చవిచూస్తే పార్టీ పరిస్థితి ఏం కాను.. అంటూ సీఎం కేసీఆర్ తెగ మదనపడుతున్నారట. ఈ ఎన్నికలేమో వరుస కట్టి మరీ వస్తున్నాయి. ఏం చేస్తారు. అందుకే.. త్వరితగతిన మేల్కొని దిద్దుబాటు చర్యలను కేసీఆర్ ప్రారంభించారు.