చిత్తూరు జిల్లా డాక్టర్ అనితారాణి ఎరక్కపోయి ఇరుక్కుపోయారా? తాను ఒకటనుకుంటే మరొకటి జరుగుతుందా? ఏపీ సర్కార్ అనితారాణికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందా? అంటే అవుననే తెలుస్తోంది. అనితారాణి ఇటీవలే వైకాపా నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దిగువ స్థాయి సిబ్బందిని ప్రశ్నిస్తే రంగంలోకి వైకాపా నేతలు దిగి, అటుపై ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎంటరై అసభ్య పదజాలంతో దూషించారని, బాత్ రూమ్ కి వెళ్లిన వీడియోలు కూడా తీసారని సంచలన ఆరోపణలతో నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు.
ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆమెకు మద్దతుగాను నిలించారు. అనితారాణిని మరో సుధాకర్ ని చేస్తారా? అంటూ అధికారపక్షం పై మండిపడ్డారు. తాజాగా అనితా రాణి వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీఐడీకి అప్పగించింది. నిజా నిజాలు విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని జగన్ అధికారులకు స్పష్టం చేసారు. దీంతో సీన్ రివర్స్ అయింది. అనితారాణి వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమేనని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ పెంచలయ్య స్పష్టం చేసారు. పెనుమూరు పీహెచ్ సీలో విధులు నిర్వహించే సమయంలో ఆమెపై ఆరోపణలు రావడంతో క్షయ నివారణ కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపామన్నారు. అమె విధులు నిర్వహించిన ఆసుపత్రి నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయన్నారు.
పనిచేసిన ప్రతి చోట రోగులతో గొడవ పెట్టుకునేవారన్నారు. ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం చేయకుండా రక్తం కారుతున్నా బయటకు పంపడంతో రోగి బంధువులు అనితారాణి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వివరించారు. గతంలో ఆమె విధులు నిర్వహించిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎక్కడా ఆరు నెలలు మించి విధులు నిర్వహించలేదని శాఖపరమైన చర్యలు ఎదుర్కున్నారని ఆయన తెలిపారు. బిల్లుల విషయంలో సబ్ ట్రెజరీ అధికారితోను గొడవలు పడ్డారని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ది నిధుల వినియోగంలోనూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవరించేవారని డాక్టర్ పెంచలయ్య తెలిపారు. అనితారాణి ఎక్కడెక్కడ ఎన్ని రోజులు డ్యూటీకీ వెళ్లారు? ఆసుపత్రిలో ఎన్ని గంటలు ఉండేవారు వంటి వివరాలన్నీ రికార్డులో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో అనితారాణి ఎరక్కపోయి ఇరుక్కు పోయినట్లు అయింది.