పోలవరం పూర్తయితే సీఎం జగన్కు మంచి పేరు వస్తుందని… టీడీపీ నాయకులు భయ పడుతూ… ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో భారీగా కుంభకోణం జరుగుతుందని వైసీపీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీ మీద కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ టీడీపీకి ఏజెంట్ గా రఘురామ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్ట్ మీద జరిపిన సమీక్ష సందర్బంగా మీడియాతో మాట్లాడిన అనిల్ టీడీపీ పార్టీ, లోకేష్ మీద విరుచుకుపడ్డారు. మంత్రి మాట్లాడుతూ… పోలవరం పూర్తయితే దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ గార్లకి మంచి పేరు వస్తుందన్న భయంతోనే రఘురామ లాంటి వాళ్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం మీద బురదజల్లటానికి చూస్తున్నారన్నారు. ఇదే సందర్భంలో చినబాబు లోకేష్ మీద మంత్రి అనిల్ చేసిన విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన లోకేష్… గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని, ఇక ఉన్న ఎమ్మెల్సీ పదవి కాలం కూడా త్వరలో పూర్తకాబోతోందనీ..ఇక టీడీపీకి ఎమ్మెల్సీ,రాజ్యసభ వచ్చే పరిస్థితి లేదని అందుకే లోకేష్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఎలాపడితే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమూల్ డైరీ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ… “జగన్ అముల్ బేబీ అయితే.. నువ్వు హెరిటేజ్ దున్నపోతువా… మాటలు నీకే కాదు…మాకు వచ్చు’’ అని, జగన్ గురించి మాట్లాడే స్థాయి, అర్హత లోకేష్ కి లేదని ఆయన హెచ్చరించారు. గడ్డం పెంచుకోగానే మాస్ లీడర్ అయిపోరని… ఆ లక్షణం రక్తంలో ఉంటుందని, నువ్వు కేవలం పప్పు నాయిడువి అంటూ లోకేష్ ని విమర్శించారు. తెలంగాణాలో ఉండి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం గురించి చంద్రబాబు జూమ్ కాల్ లో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కరోనాతో పోలవరం ప్రాజెక్టు పనులు చేసే ఇంజినీర్లను కూడా కోల్పోయామని మంత్రి విచారం వ్యక్తంచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా పోలవరం పనులు ఆపకుండా ప్రాజెక్ట్ ని పూర్తి చేసి తీరుతామని ఆయన అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి చెప్పుకొచ్చారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి రైతన్నకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.