ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా మహమ్మారి కారణంగా 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 44,609కి చేరుకుందని, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తంగా చూసుకుంటే కరోనా కారణంగా ఇప్పటి వరకు 589 మంది మృతి చెందగా, 21,763 మంది కరోనా పేషెంట్లు కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 22,260 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజులోనే 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి కలెక్టర్ ప్రకటించారు. కర్ఫ్యూ టైమ్‌లో అత్యవసర వైద్యసేవలు, మెడికల్ షాపులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. మిగతా అన్ని సేవలు తాత్కాలికంగా మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఎవరైనా నిబంధనలు పాటించకుండా, అనవసరంగా రోడ్ల మీద తిరిగితే వారి పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూగోజీలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపద్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.