నిఖార్సైన రాజకీయాలకు రోజులు కావివి అని విశ్లేషకులు ఊరికే అనడంలేదు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలను చూస్తే వాళ్ళన్నదే నిజమనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు రాజకీయాలంటే ప్రజల మనసుల్ని తాకేలా ఉండేవి. కానీ ఇప్పుడు బుర్ర నుండి జేబు దాకా వెళ్లి అక్కడే ఆగిపోతున్నాయి. ఈ విపరీతానికి కారణం మన రాజకీయ నాయకులే. ఆంధ్రా రాజకీయాల్లోకి పొలిటికల్ స్ట్రాటజిస్టులను తీసుకొచ్చి అంతంతమాత్రంగానే ఉన్న వాటిని మరింత చెడగొట్టి పెట్టారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులకు కనీసం తెలుగు కూడ రాకపోవడం. తెలుగే రావట్లేదు అంటే తెలుగు ప్రజల నాడి వారికెలా తెలుస్తుంది. కానీ ఎన్నికల్లో గెలుపోటములను మాత్రం వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రశాంత్ కిశోర్ అనే పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్టును చెల్లించి నియమించుకున్నారు. సదరు స్ట్రాటజిస్ట్ కొన్ని రోజులు ఏపీలోని పలు ప్రాంతాలకు తన బృందాలను పంపి సర్వే చేయించి ప్రజల స్థితిగతులను చూసి ఒక అంచనా వేశారు. అదే ఇక్కడి పేదలకు డబ్బు ఆశచూపితే సరిపోతుందనే అంచనా. ఆ అంచనా మేరకే వైఎస్ జగన్ పలురకాల నగదు బదిలీ పథకాలను రూపొందించి ఎన్నికల ప్రచారంలోకి దగారు. ఇక మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాల ప్రజలను కేవలం ప్రచారం అనే ఆయుధంతో ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా, టీవీ, ప్రింట్, డిజిటల్ ఇలా అన్ని మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం చేసి ఓటు వైసీపీకి వేయాలనే నిర్ణయనైకొచ్చేలా చేసేశారు.
ప్రశాంత్ కిశోర్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. ఆయన దృష్టిలో జనం అంటే కేవలం ఓటర్లు, కేవలం ఓటర్లు మాత్రమే. ఇంకేమీ కాదు. వాళ్లకు కావలసిందేదో వారికి పడేస్తే మనకు రావాల్సిన ఓట్లు మనకు పడిపోతాయ్ అనేది ఆయన లెక్కట. దురదృష్టవశాత్తు ఆ లెక్కే ఫలించింది. కేవలం సంక్షేమ పథకాల ప్రచారంతోనే జగన్ గెలుపు గుర్రం ఎక్కేశారు. ఇక విధానపరమైన నిర్ణయాలు, అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, శాశ్వత జీవనోపాధిని, సంపదను సృష్టించడం లాంటివి ఏవీ అక్కడ లేవు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. అలా తెలుగు కూడ రాణి ఒక ఉత్తరాది స్ట్రాటజిస్ట్ 2019 ఎన్నికలను డిసైడ్ చేశారు.
దాన్ని చూసి చంద్రబాబు నాయుడు కూడ ఉత్తరాది నుండి రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్టును రంగంలోకి దింపారు. కొన్ని నెలలుగా ఏపీని పరిశీలిస్తున్న సదరు స్ట్రాటజిస్ట్ చేయబోయేది కూడ చివరకు డబ్బును పంచిపెట్టడమనే పనే. కాకపోతే పేర్లు మారతాయంతే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నో ఎన్నికలను చూసిన, పాల్గొన్న అనుభవం ఉన్న బాబే ఇలా ఉత్తరాది నుండి వచ్చిన ఒక ప్రైవేట్ వ్యక్తిని తనను ముఖ్యమంత్రిని చేయడానికి నియమించుకున్నారు అంటే రాజకీయాలు ఎంత కమర్షియల్ అయిపోయాయి, నాయకుల దృష్టిలో జనం ఎంత చులకనగా ఉన్నారో అర్థమవుతోంది.