ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలదాకా అప్పు దొరకనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ‘తీపి’ కబురు అందించింది. ప్రతి నెలా అప్పులు చేయనిదే, రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. కేంద్రం నిర్దేశించిన పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ప్రగతిని సాధిస్తోంది. మూలధన పెట్టబడి విషయంలో కేంద్రాన్ని రాష్ట్రం సంతృప్తపరచగలిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసుకోవడానికి కేంద్రం వెసులుబాటు కల్పించింది. నిజానికి, విపక్షాలు చేస్తున్న రాద్ధాంతంలో రాష్ట్రానికి అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడుతుందనే వాదన సర్వత్రా నెలకొంది. అందుకు భిన్నంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు దొరుకుతున్నాయి.
చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ హయాంలో అప్పులు ఎక్కువగానే జరుగుతున్న మాట వాస్తవం. అయితే, కరోనా సంక్షోభంలో నేరుగా ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోంది సంక్షేమ పథకాల ద్వారా. ఆ కారణంగానే, రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారకుండా వుంది ప్రస్తుతానికి. కానీ, భవిష్యత్ సంగతేంటి.? అప్పులు పెరిగిపోతే, వాటికి వడ్డీలు కూడా ఎక్కువగానే ప్రతినెలా కట్టాల్సి వస్తుంది. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం కష్టంగా మారిందని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. మరి, వాటితోపాటు.. కొత్త అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తే.. ఆ పరిస్థితి ఎలా వుంటుందో ఏమో. అభివృద్ధి లేని అప్పులు.. రాష్ట్రానికి శాపమే. కానీ, కరోనా సంక్షోభంలో ఇంతకు మించిన ఆప్షన్ ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడంలేదు. కానీ, ఎన్నాళ్ళిలా.? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కాస్త కష్టమే. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అభివృద్ధి జరగాలి. అది జరగాలంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికైన వ్యవహారమేమీ కాదు మరి.