AP New Districts : ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాలతో కలిసొచ్చేదెంత.?

AP New Districts : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది. గెజిట్ విడుదలైందంటే, కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేసినట్లే కదా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా జిల్లాల విభజన షురూ అయ్యింది.

2019 ఎన్నికలకు ముందు మహా పాదయాత్ర నిర్వహించిన వైఎస్ జగన్ ఆ పాదయాత్రలోనే కొత్త జిల్లాల గురించిన ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చాక, సుమారు మూడేల్ళకు కొత్త జిల్లాలకు మోక్షం కల్పించారు వైఎస్ జగన్.

ఈ క్రమంలో నానా రకాల వివాదాలూ తలెత్తాయి.

నిజానికి, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఇలా ప్రారంభమై, అలా ముగిసిపోయిందనే అనుకోవాలి. పెద్దగా వివాదాలేమీ రాజుకోలేదు. కొన్ని పెయిడ్ ఆందోళనలు జరిగాయి. వాటిల్లో అధికార పార్టీ నేతలే ఎక్కువగా కనిపించారు కూడా.

విపక్షాలు చేసిన ఆందోళనలేవీ ఫలించలేదు. ప్రభుత్వం తాను చెయ్యాలనుకున్నది చేసుకుపోయింది. లోక్ సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. సంఖ్యా పరంగా చూస్తే, లోక్ సభ నియోజకవర్గాల కంటే ఓ జిల్లా అదనంగా ఏర్పడ్డట్టు లెక్క.

సరే, కొత్త జిల్లాలతో లాభమేంటి.? జిల్లా కేంద్రాలు వస్తాయి కాబట్టి, ఆయా ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి చెందుతాయి. కేంద్రం నుంచి జిల్లాలకు అందే నిధులు కూడా పెరుగుతాయి. సో, ఎలా చూసినా, జిల్లాల విభజనను తప్పు పట్టడానికి వీల్లేదు.