మోడీ సర్కార్ ముందు ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Lost Before Modi Politics
Modi politics

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నాక.. దానికి వ్యతిరేకంగా దేశంలో ఏదన్నా జరుగుతుందా.? అవకాశమే లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రపదేశ్‌కి ఇవ్వకూడదని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు గనకనే, రాష్ట్రం నుంచి ఏ స్థాయి ఉద్యమాలు జరిగినా ఉపయోగం లేకుండా పోయింది. జమ్మూకాశ్మీర్ విభజనను ఎవరైనా ఆపగలిగారా.? పెట్రోధరలు పెరుగుతోంటే ఏ ఉద్యమం అయినా అడ్డుకోగలిగిందా.? ఏ విషయాన్ని తీసుకున్నా అంతే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ‘అబ్బే, ఇంకా ఈ విషయమై నిర్ణయం జరగలేదు..’ అని ఏపీ బీజేపీ నేతలు ఇప్పటిదాకా బుకాయిస్తూ వచ్చారుగానీ, అదంతా ఉత్తదేనని తాజాగా తేలిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్‌సభ సాక్షిగా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో, విశాఖ ఉక్కు పరిశ్రమకీ, ఆంధ్రపదేశ్‌కీ సంబంధం లేదని తేలిపోయింది.

రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఇందులో ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసేసింది. నిజానికి, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. అనే నినాదం నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ పుట్టుకొచ్చింది. ఈ క్రమంలో 32 మంది ప్రాణ త్యాగం కూడా జరిగింది. ఆ 32 ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పాటయ్యింది విశాఖ ఉక్కు పరిశ్రమ. విశాఖపట్నం ఉనికి విశాఖ ఉక్కు పరిశ్రమతో ఆధారపడి వుందన్న వాదనలు తెరపైకొచ్చినా, కేంద్రం కనికరించలేదు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. కేంద్రం ఏమనుకుంటోందో ఏపీ బీజేపీ నేతలకు తెలియదా.? బీజేపీతో తెరవెనుకాల అంటకాగున్న టీడీపీ, వైసీపీలకు తెలియదా.? అన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, ఏపీ బీజేపీ కూడా ఏమీ చేయలేనప్పుడు జనసేన పార్టీ మాత్రం ఏం చేయగలుగుతుంది.? అయిపోయింది.. అంతా అయిపోయింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే. ఉక్కు పరిశ్రమ అక్కడే వుంటుందా.? లేదంటే, కొన్నాళ్ళ తర్వాత కాలగర్భంలో కలిసిపోతుందా.? అన్నదానిపై ఎవరి వాదన వారిదే. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. మోడీ సర్కారు చేతిలో ఆంధ్రపదేశ్ ఇంకోసారి దారుణంగా ఓడిపోయింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles