ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా మరిన్ని పథకాలను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అదనంగా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని ప్రకటించారు.
దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. దాన్ని నేను వినియోగించుకుని పేదలకు వీలైనంత మేలు చేస్తున్నానా, లేదా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటా. ఏమైనా తప్పులు చేస్తున్నానా అని ప్రశ్నించుకుంటా. పేదల కోసం నవరత్నాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలు పథకాలతో పాటు పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, అప్పుడే పింఛన్లు పెంచుతారని, తమకు మాత్రం ఎన్నికలు అయిన వెంటనే ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను రూ.2250 నుంచి రూ.2500కు పెంచుతామని వెల్లడించారు. అలాగే ఐదేళ్లు పూర్తి అయ్యే సమయానికి 3000కు పెంచుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.