కరోనా.. కరోనా.. కరోనా.. ఈ మాయదారి కరోనా వల్ల ఏ పండుగా లేదు.. పబ్బం లేదు. ఇంట్లోనే జీవితం అయిపోయింది. బయటికి వెళ్లాలంటేనే వణకాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు జనాలకు. ఇప్పటికైనా కరోనా కాస్త శాంతిస్తోంది అని అనుకుంటుండగానే.. మళ్లీ సెకండ్ వేవ్ ప్రారంభమైంది.
అందుకే.. దీపావళి పండుగ నేపథ్యంలో కరోనా మరింత విజృంబించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరాలు చేసుకునే వాళ్లకు ఇది ఒకింత షాకింగ్ నిర్ణయం అనే చెప్పాలి. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు.. దీపావళి సంబరాల్లో భాగంగా కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలి. అంటే దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందుకే.. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని ఆంక్షలు విధించింది ప్రభుత్వం. భారీ సంఖ్యలో టపాసులు పేల్చడం వల్ల వాయు కాలుష్యం అవుతుంది. అందులోనూ టపాకాయల్లో ఉండే కాలుష్య కారకాలు గాలిలో కలవడం వల్ల విషవాయువులను జనాలు పీల్చుకొని లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. అందులోనూ కరోనా సమయంలో టపాసులు ఎక్కువ పేల్చడం కరెక్ట్ కాదని… ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.