అప్పుల ఆంధ్రప్రదేశ్.. ఇందులో నిజమెంత.?

ఇందులో దాపరికం ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్రా ష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎలా అప్పులు చేస్తున్నదీ అందరికీ కనిపిస్తూనే వుంది. ‘ఔను, అప్పులు చేస్తున్నాం. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడానికే అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పులు చేయడం ద్వారా ఎలాంటి అక్రమాలకూ పాల్పడటంలేదు. ప్రతి పైసా ప్రజలకు చెందేలా చేస్తున్నాం..’ అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.

కానీ, అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేయడం ద్వారా వైఎస్ జగన్ సర్కార్ ఎలాంటి సంకేతాల్ని పంపదలచుకుంటోంది.? చంద్రబాబు హయాంలోనూ అప్పులు జరిగాయి. ఆ అప్పుల కుప్ప ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారింది. ఇప్పటి అప్పులు, భవిష్యత్తుకి శాపంగా మారతాయి. అప్పులు చేస్తున్నారు సరే, వాటిని తీర్చేదారేది.?

అధికారంలో వున్నోళ్ళు ప్రభుత్వం తరఫున అప్పులు చేస్తే.. ఆ తర్వాత భారం పడేది ప్రజల మీదనే. అంతిమంగా ప్రజలే ఇక్కడ నష్టపోతారు. ఇది ఓపెన్ సీక్రెట్. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించినా, ఇంకొకరు ప్రశ్నించినా.. అప్పుల విషయమై రాష్ట్రంలోని వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడేమీ చేయలేని దుస్థితి.

నిజానికి, రాష్ట్రానికి కేంద్రం ఇబ్బడిముబ్బడిగా సాయం చేయాలి. కానీ, అలా కేంద్రం సాయం చేయాలంటే, రాష్ట్రం తరఫున కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి వుండాలి. అధికార పక్షమే కాదు, విపక్షాలూ ఈ విషయంలో నోరు పెగల్చడంలేదు. అదే రాష్ట్రానికి పెద్ద శాపం.

కేంద్రం గనుక, రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చి వుంటే.. రాష్ట్రం మరీ ఇంతలా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి వుండేది కాదు. తమ తప్పిదాన్ని తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు అప్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ, రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.