ఏపీ మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. సులభతర వాణిజ్య విధానం విభాగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇదివరకు ఉన్న తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
తాజాగా కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2019 ర్యాంకులను విడుదల చేశారు.
ఆ జాబితాలో మొదటి స్థానంలో ఏపీ ఉండగా.. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
గత సంవత్సరం ఇచ్చిన ర్యాంకింగ్స్ లో తెలంగాణ రెండో స్థానంలో ఉండేది. ఇఫ్పుడు ఒక స్థానం తగ్గి మూడో స్థానానికి చేరుకుంది.
నాలుగో స్థానంలో ఎంపీ, 5 జార్ఖండ్, 6 ఛత్తీస్ గఢ్ లు నిలవగా… గత సంవత్సరం 12వ స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్.. ఈ సారి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం విశేషం.
మరోవైపు లాక్ డౌన్ కారణంగా కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ను అమలు చేయడంలో కూడా ఏపీ అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది.
తొలి మూడు ర్యాంకులు సాధించిన ఏపీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిర్మలా సీతారామన్ అభినందనలు తెలియజేశారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య ఉండే ఆరోగ్యకరమైన పోటీల్లో ఏపీ, యూపీ, తెలంగాణ ముందున్నాయని ఆమె ఈసందర్భంగా స్పష్టం చేశారు.