ఆంధ్రప్రదేశ్ రాజధాని.. ‘కథ’ కంచికి చేరేదెప్పుడు.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయదశమినాడే బీజం పడింది. చంద్రబాబు హయాంలో విజయదశమి పర్వదినాన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఏళ్ళు గడుస్తున్నాయ్.. ఎక్కడుంది అమరావతి.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు.

చంద్రబాబు హయాంలో అమరావతికి ప్రతిపాదన జరిగితే, దానికి అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని హాజరైనా, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెళ్ళలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాజధాని అంటే, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. అలాంటిది, రాజధాని లేకుండా రాష్ట్రం ఇన్నేళ్ళపాటు ఎలా మనుగడ సాధించగలుగుతోంది.? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజధాని లేకనేం.. అమరావతే ఇప్పటికీ రాష్ట్ర రాజధాని. అయితే, అమరావతిలో చంద్రబాబు హయాంలో ప్రారంభమైన నిర్మాణాలు ఆ తర్వాత ఆగిపోయాయి.

చంద్రబాబు హయాంలో సెక్రెటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణం జరిగింది. హైకోర్టు కూడా అందుబాటులోకి వచ్చింది. మరికొన్ని భవనాలూ నిర్మితమయ్యాయి. కొన్ని భవనాలు ప్రారంభ దశలో వుండగా, అవన్నీ ఆ తర్వాత ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రాతిపాదన తెరపైకొచ్చింది. కానీ, కోర్టు కేసుల కారణంగా ఆ మూడు రాజధానుల వ్యవహారంపై ‘స్టేటస్ కో’ కొనసాగుతోంది.

మూడు సంగతి తర్వాత.. అసలంటూ ఏకైక రాజధాని అమరావతి విషయంలో అయినా వైఎస్ జగన్ సర్కార్ ముందడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇంకెన్నాళ్ళు రాష్ట్ర ప్రజల్ని ఇలా మభ్యపెడతారు.? అన్న ప్రశ్న రానేకూడదు. కానీ, వచ్చేసింది.

రెండున్నరేళ్ళు గడిచిపోయాయ్.. ఇంకో రెండున్నరేళ్ళలో అమరావతికి అదనంగా మరో రెండు రాజధానుల నిర్మాణం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాంటిది. బేషజాలకు పోయి, రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పడేయడం అధికార వైసీపీకి తగదన్న విమర్శ అస్సలేమాత్రం వాంఛనీయం కాదు.